నీవు నన్ను కాల్చివేసినా నా మనసు కోటను కూల్చివేసినా వెలుగునార్పి చీకటి నింపినా నిన్ను వెతికే మదిని చిత్తు చేసినా కాలానికి సైతం సవాలు వేస్తూ నీకోసం ఆపుతానంటూ నీ కదలికతో కదుపుతానంటూ
నా జీవిత సారం నీవని తెలిసి నే కోరే గమ్యం నీ వలపని తెలిసి మరలా నీకై, నీ తలపుకై ఎదురుచూసే నా మనసుని ఆగిపొమ్మంటూ... నీకై కొంతకాలం ఇంకొంతకాలం మదిని అణచుకొమ్మంటూ నీవనే మాటల గారడి పదే పదే గుర్తుకొస్తుంటే...
నీ చేయి పట్టుకుని ఓ సుధీర్ఘ పయనానికి నడుచుకుంటూ వెళ్ళాలనిపిస్తోంది... మరు క్షణం నా చేయి ఒంటరిదని జ్ఞప్తికొస్తోంది...
నీ చేతి స్పర్శ లేక నా మనసు నిర్వీర్యమైపోయింది...
ఈ ఒంటరి పయనానికి తోడునందిస్తావనీ, జీవితాంతం నా చేతిని వదలకుంటావనీ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ అనే నా ఆవేదన తీరుస్తావని ఆశిస్తూ నీపై తరగని ప్రేమతో...
కనులు మూసినా కనులు తెరచినా కలతవై నువు ఎదురొస్తుంటే... కనుల ఎదురుగా కనుమరుగయ్యే మనసు మాట విననంటోంది... మాటలలోని మధుర భావనే మూగబాసయై మురిపిస్తుంటే... మది కోరే తలపు నీవనీ మనసు నీకై చని వస్తోంది...
జీవితమంతా నీతోనేనని నీతో తెలిపే ధైర్యం లేదని... సమయం సహకిరిస్తే నీవు కలవనిస్తే... నా తలపు తెలిపే తరుణం కోసం నీకై నా మది ఎదురుచూస్తోంది...
నిన్ను చూసిన ఆఖరి తరుణం మదిని వీడి పోను అంటోంది... నిన్ను వీడిన ఆ తొలి సమయం మనసును సాంతం ముంచివేస్తోంది...
ఇది కవిత కాదనీ, నా మనసు మాటనీ... ఇది నీ కోసమేననీ, నన్ను నీతో కలపాలనీ... చీకటి తుంచిన చేతులతోనే జీవితాంతం వెలుగు నింపమని మురిసిపోయే మనసుతో, కవ్వించే కులుకులతో, జీవితమంతా నాతో ఉంటావని మాటిస్తావని కోరుకుంటూ...